• Home »
  • Entertainment »
  • త్వరలో మలయాళం మార్కెట్ లోకి జీ టీవీ

త్వరలో మలయాళం మార్కెట్ లోకి జీ టీవీ

ఈ మధ్యనే ఒడియా చానల్ సార్థక్ ని కొనుగోలు చేసిన జీ టీవీ ఇప్పుడు మలయాళ మార్కెట్లోకి ప్రవేశించాలని భావిస్తోంది. కొత్తగా చానల్ ప్రారంభించటం కంటే, ఇప్పటికే ఉన్న చానల్ ని ఏదైనా కొనుగోలు చేయటం మెరుగనే నిర్ణయానికొచ్చింది. ఒడియా తరహాలోనే మలయాళంలోనూ అమ్మకానికి ఏదైనా చానల్ సిద్ధంగా ఉందేమో చూస్తున్నట్టు జీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రాంతీయ చానల్స్ లోకి విస్తరించటానికి రూ. 1,780 కోట్లు సిద్ధంగా ఉంచుకున్నట్టు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ ఇటీవలే వెల్లడించింది.

తెలుగులో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నెంబర్ వన్ గా జీ తెలుగు చానల్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఇక కన్నడ లోనూ స్థిరంగా రెండు, మూడు స్థానాల్లో జీ కన్నడ కనబడుతూ వస్తోంది. ఆలస్యంగా ప్రారంభమైన తమిళంలో పుంజుకుంటుండగా ఇక మలయాళంలోనూ రంగ ప్రవేశం చేయటం ద్వారా దక్షిణాదిన ఉనికిని పూర్తిగా చాటుకోవాలన్నది జీ ప్రయత్నంగా కనిపిస్తోంది.

ఇప్పటికే బాగా రద్దీగా తయారైన మలాయాళీ జనరల్ ఎంటర్టైన్మెంట్ మార్కెట్లో కొత్తగా చానల్ ప్రారంభించి నెగ్గుకు రావటం దాదాపు కష్టమని మార్కెట్ వర్గాలు విస్పష్టంగా చెబుతున్నాయి. జీ ఆలోచనా ధోరణి కూడా అదే విధంగా ఉంది. ప్రసారభారతి వారి డిడి మలయాళం పక్కనబెడితే, మొత్తం 13 జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్, రెండు మూవీ చానల్స్, రెండు మ్యూజిక్ చానల్స్, మూడు యూత్ చానల్స్, రెండు కిడ్స్ చానల్స్, ఒక ట్రావెల్ చానల్, ఏడు న్యూస్ చానల్స్ మలయాళీ మార్కెట్ ను సుసంపన్నం చేస్తున్నాయి.

ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే స్టార్ ఇండియా వారి ఏషియానెట్ తిరుగులేని నెంబర్ వన్ స్థానం కొనసాగిస్తోంది. సన్ నెట్ వర్క్ వారి సూర్య టీవీ, మలయాళం కమ్యూనికేషన్స్ కి చెందిన కైరలి, అమృత టీవీ, మళవిల్ మనోరమ, జైహింద్, దర్శన టీవీ, కేరళ విజన్, జనం టీవీ ఉన్నాయి.  స్టార్ గ్రూప్, సన్ గ్రూప్ విడిగా చానల్స్ ని అమ్మే అవకాశం లేదు కాబట్టి మిగిలిన చానల్స్ నుంచి జీ గ్రూప్ ఎంచుకోవాల్సి ఉంటుంది.