• Home »
  • Cable »
  • ట్రాయ్ టారిఫ్ ఉత్తర్వులు అమలయ్యేదాకా నిర్దిష్ట ఫీజు అమలుకే జీ గ్రూప్ నిర్ణయం

ట్రాయ్ టారిఫ్ ఉత్తర్వులు అమలయ్యేదాకా నిర్దిష్ట ఫీజు అమలుకే జీ గ్రూప్ నిర్ణయం

పే చానల్స్ చందా ధరలvమీద టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) ప్రకటించిన విధానం  మీద అభ్యంతరాలు ఇంకా కోర్టులో తేలాల్సి ఉండటంతో ఈలోగా నిర్దిష్టమైన మొత్తాల విధానం అవలంబించాలని జీ గ్రూప్ నిర్ణయించుకుంది. టారిఫ్ యథాతథంగా అమలు చేస్తున్నట్టు ప్రకటించినా అది కోర్టు ధిక్కారం కిందికే వస్తుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

ఈ విధానం వలన పంపిణీ సంస్థలు ఆ గ్రూప్ చానల్స్ అందుబాటు గరిష్ఠంగా ఉండేలా చూస్తారని, ఆవిధంగా ప్రేక్షకాదరన పెరిగే అవకాశం ఉందని తెలియటం వల్లనే జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఈ పద్ధతి పాటిస్తోంది. బ్రాడ్ కాస్టర్ కు చెందిన అన్ని చానల్స్ ప్రసారం చేసినందుకు పంపిణీ సంస్థకు నిర్దిష్టమొత్తం అందుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసానికి చందాల ఆదాయం 15.5% తగ్గటం గుర్తించింది. అయితే, స్పోర్ట్స్ వ్యాపారం అమ్మటమే అందుకు కారణమని భావిస్తోంది.

ట్రాయ్ టారిఫ్  ఉత్తర్వులకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో తెలియని అనిశ్చిత వాతావరణంలో ఉండటం వలన నిర్దిష్టమైన ఫీజు మొత్తాలకు ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వస్తున్నట్టు  సంస్థ ఎండి, సీఈవో పునీత్ గోయెంకా వెల్లడించారు. డిజిటైజేషన్ మొదటి రెండు దశలకంటే మూడు, నాలుగు దశల్లో ఆదాయం తక్కువగా ఉంటుందని కూడా తేలిందన్నారు. ఇప్పటి ఒప్పందాలు పూర్తయినవెంటనే ఆదాయం పెరుగుతుందని కూడా అంచనా వేస్తున్నామన్నారు.

ఆదాయం 26% పెరగటం గురించి ప్రస్తావించగా అది కేవలం  కార్యక్రమాల వ్యవధి పెరగటం వల్లనే సాధ్యమైందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దానివల్లనే ఆదాయం పెరిగిందని, అదే సమయంలో జీ సినీ అవార్డులను ముందుకుజరపటం వల్ల కూడా ఈ పెరుగుదల నమోదైందని అన్నారు. కార్యక్రమాల వ్యవధిని సైతం వారానికి 32 గంటలనుంచి 35 గంటలకు పెంచినట్టు చెప్పారు. వచ్చే ఏడాది ఇది మరింత పెరుగుతుందన్నారు.

ఉచిత చానల్స్ సంపాదించే ప్రకటనల ఆదాయం దాదాపుగా రూ.2,000  కోట్లకు చేరుకుంటున్నదని, అయితే మొత్తం ప్రకటనల ఆదాయం మార్కెట్ తో పోల్చుకున్నప్పుడు ఉచిత చానల్స్ వాటా 5 నుంచి 6 శాతం మాత్రమే ఉంటున్నదన్నారు. తమిళ మార్కెట్ లో నెలకొన్న పోటీ గురించి చెబుతూ మొదటి మూడు చానల్స్ కు మాత్రమే లాభాలుంటాయని, మిగిలినవి నష్టపోవాల్సిందేనని  గుర్తుచేశారు.

జీ5 పేరుతో ఫిబ్రవరిలో  ప్రారంభించబోయే వీడియో ఆన్ డిమాండ్ లో అద్భుతమైన కంటెంట్ ఉంటుందని, అందరూ అసూయ చెందే స్థాయిలో ఉండబోతున్నదని సవాలు విసిరారు. తొలి రోజు నుంచీ ఒరిజినల్ కంటెంట్ మాత్రమే అందిస్తామని, అదే తమ బలంగా మారుతుందని పునీత్ గోయెంకా ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ఒటిటి వేదికలలో ఎక్కడా లేని విధంగా ఫీచర్స్ ఉంటాయని కూడా చెబుతున్నారు. సినిమాల డిజిటల్ ప్రసార హక్కులు కూడా ప్రత్యేకంగా తమకు మాత్రమే ఉండేలా కొనుగోలు చేస్తామన్నారు.

జీ గ్రూప్ తన రజతోత్సవాలకోసం, బ్రాండింగ్ కోసం రూ.40 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు.  కొత్త బ్రాండ్ ను ప్రమోట్ చేయటం కోసం, బ్రాండ్ అంబాసిడర్ల నియామకం కోసం ఖర్చు చేసినట్టు చెప్పారు. డిజిటల్ ప్రేక్షకులు పెరగటం గమనించటం వల్లనే దీని మీద దృష్టి  సారించామన్నారు. అదే సమయంలో హెచ్ డి చానల్స్ కొత్తవి ప్రారంభించటం మీద, కొత్త చానల్స్ ప్రారంభించటం మీద దృష్టిపెడతామన్నారు.